ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి…!
లగేజ్ డోర్ తెరిచి ఉండటమే ఐదుకు కారణమా..?
నవభారత్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి సతీష్‌రెడ్డి మృతి

పాల్వంచ మన ప్రజాశక్తి :
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బస్సు లగేజ్ డోర్ తెరిచి ఉండటంతో రోడ్డు పక్కన బైక్‌పై కూర్చున్న సింగరేణి ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన పాల్వంచలోని నవభారత్ సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. నవభారత్‌కు చెందిన సతీష్‌రెడ్డి (40) సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం టీ తాగేందుకు నవభారత్ సెంటర్‌కు వచ్చిన ఆయన, రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి టీ తాగాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు బైక్‌పై కూర్చుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న బీఎస్‌ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణమైంది.బస్సు లగేజ్ డోర్ తెరిచి ఉండగా, దాన్ని గమనించకుండా డ్రైవర్ బస్సును వేగంగా నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో తెరిచి ఉన్న లగేజ్ డోర్ సతీష్‌రెడ్డి తలకు బలంగా తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే జరిగిన ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికిగురయ్యారు.సమాచారం అందుకున్న పాల్వంచ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు లగేజ్ డోర్ తెరిచి ఉండటానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణలో స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబానికి అండగా నిలవాల్సిన సతీష్‌రెడ్డి అకాల మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
